జడ పురాణం...
ఆ... జడా...అని కొట్టిపారేయకండి - జడకి చాలా పెద్ద సీనే ఉంది
“ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా”
జడ గురించి రాధా గోపాలంలో ఓ అందమైన పాటని స్నేహ, శ్రీకాంత్ ల మీద బాపూగారు అద్భుతంగా చిత్రీకరించారు.అది మణశర్మ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గార్ల ఉభయుల మస్తిష్కంలోంచి జాలువారిన పాట- ఆ పాట చిత్రీకరణ గురించి నేను ప్రత్యేకంగా వర్ణించనవసరం లేదు-అదో అద్భుతః!
జడవేయని ఆడవాళ్లు, ఆ జడలని (జడతోపాటు ఆ జడ తాలూకూ యజమానులని కూడా అనుకోండి) పొగడని మొగవాళ్ళు ఉంటారా ఈ లోకంలో-జడపదార్ధాలే కదా జడలని, వాటి హక్కుదారుల్ని పొగడకుంటే!
అలాగే మన కవులు జడలలో రకాలను కూడా వర్ణించారు-ఇప్పుడు కేశాలంకరణ నిపుణులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు పెళ్లిళ్లలో వాళ్లకున్న నైపుణ్యంతో- పెళ్ళికూతురికి వేసే పెళ్లి జడలపై!
వాలు జడ
పూల జడ
పొట్టి జడ
పొడుగు జడ
చింపిరి జడ
కొత్తిమీర కట్ట జడ
నాగుపాము లాంటి జడ
పలకల జడ
పాయల జడ
కుచ్చుల జడ
మల్లెల జడ
పలకల జడ
చక్రాల జడ
వంకుల జడ
ఇంకా మరెన్నో...
ఈ జడల అల్లిక అంటే ఆషామాషీ కాదు,దానికి చాలా నైపుణ్యం,అనుభవం ఉండాలి. ఇంట్లో ఈ అనుభవం ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా అంత జుట్టు ఉన్న ఆడపిల్లలు ఎందరు-ఓవేళ ఉన్నా ఇలా జడల అల్లికలు చేయించుకునేవాళ్ళు ఎందరు; ఇప్పటితరం అమ్మాయిల్లో ఏ కొద్దిమందికో పెద్దజడ వేసుకునే జుట్టూ ఉంటుంది, కొద్దిగా జడల అల్లికలో అనుభవమూ ఉంటుంది!
ఉన్న జుట్టు ఎంత- ఆ ఉన్న జుట్టుకే ఓ రబ్బర్ బ్యాండ్ తగిలించుకోవడమో, రకరకాల క్లిప్పులు తగిలించుకోవడమో చేస్తుంటారు “జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకుట్టుంది” అని వెనకటికి ఓ సామెత- ఆ సామెత అవసరమే లేదు ఈ రోజుల్లో- అంతగా కావాలంటే సవరంతో అవసరం తీర్చేసుకోవచ్చు అనుకోండి- పొడుగు జుట్టే కావాలా!
జడ అనేది గత దశాబ్దం పైగా అమ్మాయిలు చాలామంది మర్చిపోయినవాళ్లే; మహాఅయితే కాలేజీ చదువులవరకు ఉండి ఉండొచ్చేమో- అదీ కొద్దిమంది మాత్రమేనండి - వాళ్ళు జడ వేసుకొని వెళ్లి ఉంటారు.అది కూడా ఏ ప్రభావాలకు, స్నేహితుల ఒత్తిళ్లకు లొంగకుండా ఉన్న జుట్టు కత్తిరించుకోకుండా ఉంటే.
ఉద్యోగాల్లో చేరడం ఆలస్యం- కురులు పురివిప్పినాట్యమే నెమలిపింఛం లాగా “కురులబంధనం” అనేదే లేదు,కానీ వీళ్లందరూ జీవితంలోమరొక్కమారు వేసుకుంటారు తప్పకుండా-వాళ్ళ పెళ్లికి పూలజడ-సవరం సహాయంతో;లేదంటే అదీ అక్కర్లేదు ఉన్న ఆ నాలుగు వెంట్రుకలకే డిజైనర్ పూలజడ కుట్టేస్తారు!
చివరకి తేలింది ఏమిటంటే- జుట్టే ఉండనవసరం లేదు కొప్పు పెట్టుకోవడానికి- ఓ కేశాలంకరణ నిపుణినికి తల అప్పచెప్తే ఎడమ చేత్తో వేసేస్తారు ఎలాంటి కొప్పు అయినా.కొన్నాళ్ళకి పొడుగు జడలు ఉన్న అమ్మాయిల్ని ఈ నూటికో కోటికో ఒకళ్ళని చూస్తామేమో!
అదృష్టవశాత్తూ మీకు అలా పాముకుబుసం లాంటి జడల జాడలు కనపడితే మాత్రం కాస్త పక్కకు ఆగి, నిమ్మళంగా చూసి (జడని మాత్రమే) మళ్ళీ మీ దారిన మీరు వెళ్ళండి.మోటార్ సైకిలు మీదో, కార్ లోనో వెళ్తూ వెళుతూ మాత్రం ఆ పని చేయబోకండి-ఆక్సిడెంట్ అయిపోగలదు జాగ్రత్త - జడ సంగతి తర్వాత జవసత్వాలు మొత్తం పోయి ఆసుపత్రి పాలు అవగలరు-పైపెచ్చు ఇంట్లో సంజాయిషీలు ఇచ్చుకోలేక చావాలి మళ్ళీ,ప్రమాదానికి తోడుగా.